నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి” రివ్యూ – రేటింగ్

నటీనటులు : నాని, సాయి పల్లవి, భూమిక
దర్శకత్వం : వేణు శ్రీరామ్
నిర్మాత : దిల్ రాజు, శిరీష్ , లక్ష్మణ్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో.. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేక్షకుడిని ఎలా మైమరిపించాడో చూద్దాం..

కథ :

నాని(నాని)కి తన అన్న(రాజీవ్ కనకాల)అంటే చాలా ఇష్టం. మధ్యలో వదినగా భూమిక(జ్యోతి) రావడం అన్నదమ్ముల మధ్య దూరం పెరగడం వదిన మీద చిరాకు పడతాడు నాని. అదే సమయంలో సాయి పల్లవి(పల్లవి) పరిచయమై ప్రేమలో పడతాడు నాని. ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతికి డ్యూటీ విషయంలో లోకల్ రౌడీ వరంగల్ శివతో గొడవ మొదలవుతుంది. దాంతో శివ ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి నాని అడ్డుపడతాడు. ఇలా గొడవ పెద్దదై శివ జ్యోతిని చంపుతానని ఛాలెంజ్ చేస్తాడు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడైన నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్:

మిడిల్ క్లాస్ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది. సినిమాబోర్ కొడుతుంది అనే సమయానికి నాని తన నాచురల్ పెర్ఫార్మన్స్ తో సినిమాను సక్సెస్ చేసాడు. సినిమాకు నాని ముఖ్యమైన ప్లస్ పాయింట్. సినిమా మొదటి భాగంలో తన వదినకు తనకి వచ్చే మనస్పర్థలు, అవి బయటపెట్టే సన్నివేశాలు, ఒక సాధారణ కుటుంబపు కుర్రాడు జీవితం ఎలా ఉంటుందో చేయించే సీన్లు చాలా బావున్నాయి. సాయి పల్లవితో లవ్ ట్రాక్ కూడా చాలా ఆకట్టుకుంటుంది. నాని,పల్లవి ఉన్న ప్రతీ సన్నివేశం నవ్వుల పూలు పూయిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగిగా, భాద్యతగల పాత్రలో భూమిక తన పెరఫార్మన్సుతో మెప్పించారు. అంతగా స్కోప్ లేకపోయినా తన పాత్రకు తగిన న్యాయం చేసింది పల్లవి. సినిమా రెండవ భాగంలో చివరి దశలో నాని జ్యోతిని కాపాడే సన్నివేశాలు సినిమాకు హైలైట్. విలన్ పాత్రలో విజయ్ పర్వాలేదనిపించాడు.

మైనస్ పాయింట్స్ :

పాత కథనే మళ్ళీ చూయించడం. మధ్యతరగతి కుర్రాడు ఖాళీగా ఉంటూ ఇంటి పనులు చక్కబెట్టే వాడిగా, కుటుంబాన్ని కాపాడే సమయానికి హీరోలాగా ఆలోచించడం లాంటి సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.ఇంటర్వల్ సీన్ కు ముందే కథ ఏంటో అర్ధం అవ్వడంతో రెండవ భాగంలో సినిమాను అంచనావేయవచ్ఛు. పెద్దగా థ్రిల్ ఫీలయ్యే సన్నివేశాలు లేకపోవడం. సినిమా ముగింపు కూడా లాజిక్ లేకుండా ముగియడం..దర్శకుడి ప్రతిభ ఎక్కడ కనపడకపోవడం కాస్త నిరాశ పరిచే విషయం. థియేటర్ నుంచి బయటకు రాగానే ఆ పాటలకు నిజంగా దేవిశ్రీ సంగీతం చేశాడా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

పాత కథను కొత్తదనంతో చూయించడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ విఫలమయ్యాడు.సినిమా రెండవ భాగం కాస్త నిరుత్సాహపరుస్తుంది. దేవిశ్రీ నుండి ఆశించిన స్థాయి సంగీతం ఈ సినిమాలోని పాటలకు దొరకలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. పాటల చిత్రీకరణలో గొప్పతనం కనబడింది. దిల్ రాజు నిర్మాణ విలువలు ఎప్పటిలాగానే మంచి స్థాయిలో ఉన్నాయి.

చివరి మాట :

మొత్తం ఈ ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. నాని నటన,సినిమా మొదటి భాగంలో ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్, క్లైమాక్స్, నటీనటుల నటన ఆకట్టుకోగా చాలా సినిమాల్లో లాగానే కొత్తగా అనిపించని పాత కథ, ఆసక్తి కలిగించలేకపోయిన కథనం, అంచనాలను అందుకోలేకపోయిన దేవి శ్రీ సంగీతం వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలిచి యావరేజ్ సినిమా స్థాయిలో నిలబెట్టాయి. నాని నటనను ఇష్టపడే వాళ్ళకి, సాయి పల్లవి నటనకు ఫిదా అయిన వాళ్ళకి సినిమా నచ్చుతుంది.

చెడుగుడు మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇచ్చే రేటింగ్ : 5

Comments

comments