బద్నాం చేశాడంటూ రాజమౌళి పరువు బజారుకీడ్చిన బాబు గోగినేని

ఏదైనా ఒక మాట మాట్లాడేముందు దర్శకధీరుడు రాజమౌళి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. అందుకే.. ఆయన వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటి ఆయన ఇప్పుడు స్వయంగా వివాదంలో చిక్కుకున్నాడు. తాను నాస్తికుడిని అని చెప్పుకోవడమే ఆయనకి శాపంగా మారింది. సాధారణంగా ‘నాస్తికుడు’ అంటే దేవుడిపై ఏమాత్రం నమ్మకం లేనివాడు. అంటే.. గుళ్లకు వెళ్లడం, దేవుడ్ని పూజించడం లాంటివి చేయరు. అసలు దేవుడే లేడని నమ్మేవాడే అసలైన నాస్తికుడు. కానీ.. రాజమౌళి తాను నాస్తికుడినని చెప్తూనే గుడికి వెళ్లి, దేవుడ్ని దర్శించుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది.

ఈ విషయమై ప్రముఖ హేతువాది, ఇండియన్ హ్యూమనిస్ట్- రేషనలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని తీవ్రంగా మండిపడ్డారు. తాను నాస్తికుడినంటూ చెప్పిన రాజమౌళి.. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని బాబు గోగినేని ఆయన తీరుని తప్పుపట్టారు. ఓ ఇంటర్వ్యూలో తాను నాస్తికుడిని అని చెప్పుకున్న రాజమౌళి.. ఆ తర్వాత రెండ్రోజులకే చొక్కా విప్పేసి కండువా వేసుకుని ఒక బ్రాహ్మణుడితో కలిసి లాంఛనంగా గుడికి వెళ్లారని.. అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అలాంటివి చేస్తూ తాను నాస్తికుడిని అని చెప్పుకోవడమే సరికాదని ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా బాబు అభిప్రాయపడ్డారు. నాస్తికుడంటే దేవుడు లేడు అని నమ్మేవాడని.. కానీ రాజమౌళి నాస్తికుడినని చెబుతూ గుడికి వెళ్లడం ఏమిటని బాబు ప్రశ్నించారు.

తనలా దేవుడు లేడని నమ్ముతూ బతికే నాస్తికులు చాలామంది ఉన్నారని చెప్పిన బాబు గోగినేని.. ఈ ప్రపంచంలో వంద కోట్ల మందికిపైగా మతం లేకుండా దేవుడిని నమ్మకుండా ఉంటున్నారని తెలిపారు. అయితే.. రాజమౌళి వంటి వాళ్ల వల్ల తమలాంటి వాళ్లు బద్నాం అవుతున్నామన్నారు. రాజమౌళికి ఈ విషయంలో తాను సంధించిన ప్రశ్నలకు జవాబు రాలేదని.. ఆయన తప్పు చేశారు కాబట్టి సమాధానం ఇవ్వలేరని తాను భావిస్తున్నట్లుగా బాబు గోగినేని అన్నారు. రాజమౌళి తన తీరు మార్చుకోవాలని ఆయన కోరారు.

Comments

comments