యూట్యూబ్‌కి చుక్కలు చూపిస్తున్న ‘అజ్ఞాతవాసి’

హీరోలు పాడే పాటలకి ఎంత క్రేజ్ వస్తుందో అందరికీ తెలుసు. ప్రొఫెషనల్ సింగర్‌లా పాడకపోయినా అవి ఫ్యాన్స్‌నే కాకుండా సినీ జనాల్ని సైతం ఆకర్షిస్తాయి కాబట్టి ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పటికే కొందరు హీరోలు పాడిన పాటలు ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. లేటెస్ట్‌గా ‘అజ్ఞాతవాసి’ కోసం పవన్ పాడిన పాట ఇప్పుడు నెట్టింట్లో చరిత్ర సృష్టిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే అనిరుధ్ ప్యూర్ మాస్ బీట్ అందించడం, భాస్కరభట్ల క్యాచీగా ఉండే లిరిక్స్ రాయడం వల్ల.. ‘కొడకా కోటేశ్వరరావా’ అనే పాటు దెబ్బకు చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో అది సోషల్ మీడియాలో మోత మోగించేస్తోంది. ఈ పాట ఇంతలా దుమ్ముదులిపేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.

సాధారణంగా పవన్ సినిమాల్లో ఖచ్చితంగా రెండు లేదా కనీసం ఒక్కటైనా పక్కా మాస్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది పవన్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయినా కావొచ్చు, ఐటెం సాంగ్ అయి ఉండొచ్చు.. కానీ పవన్ చిత్రంలో మాస్ సాంగ్ ఉండడం పక్కా! దీనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు సైతం అలవాటు పడిపోయారు. అలాంటిది.. ‘అజ్ఞాతవాసి’ మూవీలో ఒక్క పాట కూడా లేకపోవడం కాస్త నిరాశ కలిగించింది. ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసే పాటల్లో ఒక్కటైనా మాస్ సాంగ్ ఉంటుందనుకుంటే.. అన్నీ పాటలు క్లాస్‌గానే ఉండడం అందరికీ వెలితి అనిపించింది. ఇలాంటి టైంలో పవన్ శైలికి తగ్గట్టు అతని నోటే ‘కొడకా కోటేశ్వరరావా’ అనే పక్కా మాస్ సాంగ్ పాడించడంతో.. అది దెబ్బకు హిట్టై పోయింది.

రెండు రోజుల్లోనే ఈ పాట దాదాపు 60 లక్షల వ్యూస్, 3 లక్షల లైక్స్ పైగా సాధించడం నిజంగా విశేషం. ఓ హీరో పాడిన పాటకి ఈ స్థాయి వ్యూస్, లైక్స్ రావడం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలోనే ఈ పాట ఇలా రచ్చరచ్చ చేస్తుండడాన్ని చూస్తుంటే.. థియేటర్లలో అభిమానుల చేత ఎలా రచ్చ చేయిస్తుందో అర్థం అవుతోంది.

Comments

comments