మొదటిరోజే 2 మిలియన్స్.. ‘అజ్ఞాతవాసి’కి అందేనా?

ఇప్పుడు తెలుగు ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది ‘అజ్ఞాతవాసి’నే! ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తుండడంతో ఈ చిత్రంపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. దీన్నే సరిగ్గా క్యాష్ చేసుకోవాలని ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు భారీ పన్నాగాలు పన్నుతున్నారు. ‘అజ్ఞాతవాసి’ రిలీజవుతున్న రోజు ఏ ఇతర చిత్రాలు రిలీజ్ అవ్వడం లేదు. సోలోగానే వస్తుండడంతో తాము పెట్టిన పెట్టుబడిని దాదాపుగా రాబట్టుకునేందుకు భారీఎత్తున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగు సినిమాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల సంగతేమోగానీ.. యూఎస్‌లో అయితే మాత్రం ఈ చిత్రం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ మూవీ రిలీజ్ చేయని స్థాయిలో ఏకంగా 580 లొకేషన్స్‌లో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్‌తోనే అక్షరాల 2 మిలియన్ డాలర్స్‌ని కొల్లగొడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం కంటే తక్కువ లొకేషన్స్‌లో రిలీజైన ‘బాహుబలి-2’ (470 లొకేషన్స్) ఏకంగా 3 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. ఈ సినిమా స్థాయిలో కాకపోయినా.. దానికంటే ఎక్కువ లొకేషన్స్‌లో ‘అజ్ఞాతవాసి’ రిలీజవుతోంది కాబట్టి కనీసం 2 మిలియన్ మార్క్‌ని దాటేయడం ఖాయమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. మరి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుందా? లేదా? వేచి చూడాలి.

Comments

comments