ఎవడి కోసం ఈ రాజకీయాలు..ఎవరిని పాలించడానికి ఈ రాజకీయాలు..??

తెలుగు ప్రేక్షకుల, వీక్షకుల సాక్షిగా, రాజకీయ అరంగేట్రం చేస్తున్న పవన్ కళ్యాణ్ సాక్షిగా, 40సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు సాక్షిగా, అన్నీ తానే అంతా నాదే అని చెప్పే చంద్రశేఖర్ రావు సాక్షిగా..అధికార పీఠంకోసం వెంపర్లాడుతున్న జగన్ సాక్షిగా, ప్రజా సమస్యలమీద పోరాడాల్సిన జర్నలిజం సాక్షిగా, పనికిమాలిన టీవీ ఛానళ్ళు నిర్వహించే సమయం వృధా చేసే చర్చా కార్యక్రమాల సాక్షిగా..కళ్ళు ఉండి చూడలేని..నోరు ఉండి మాట్లాడలేని..ప్రజల సాక్షిగా..రోజు రోజుకి దిగజారిపోతున్న మానవతా విలువల సాక్షిగా..ఆడపిల్ల పుడుతుందని ఆదిలోనే అంతమొందించే కసాయి తల్లితండ్రుల సాక్షిగా..ఎందుకు బ్రతుకుతున్నాం రా అనుకునే పూటగడవని నిరుపేదల సాక్షిగా..

అన్నీ ఉన్నా అవకాశాలు దొరక్క ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉండిపోతున్న నిరుత్సాహా నిరుద్యోగుల సాక్షిగా..నకీలీ విత్తనాలను ప్రోత్సహిస్తూ రైతన్నల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బ్రోకర్ల సాక్షిగా..పెళ్ళాం పుస్తెలు తాకట్టు పెట్టి పురుగుల మందే శరణ్యమని ప్రాణాలిడుస్తున్న మధ్యతరగతి కుటుంబాల సాక్షిగా..ఓట్ల కోసం జనాల కళ్ళకు మడుగులొత్తి అధికారం దక్కగానే ఆ మడుగులొత్తిన కాళ్ళను మడుగులో పాతిపెట్టే రాజకీయ నాయకుల సాక్షిగా..రుణభాదల ఊబినుంచి ఎప్పుడు బయటపడతాం రా దేవుడా అంటూ డొక్క చేతపట్టి ఎదురుచూస్తున్న రైతన్నల సాక్షిగా..

ఎండి ఎడారులుగా మారిన, మారుతున్న కడు బీడు భూముల సాక్షిగా..గొంతెండి దాహం తీర్చుకోవడానికి గుక్కెడు నీటి కోసం ఎదురుచూస్తున్న పశుపక్షాదుల సాక్షిగా..ఉన్నోడిని కొట్టు..పేదోడికి పెట్టు అనే సామెతను తలక్రిందులుచేసి – వక్రీకరించి పేదోడిని కొట్టు..ఉన్నోడికి పెట్టు ఉన్నదంతా దోచుకో అనే చందంగా అధికార పీఠంపై కూర్చుని కన్నుండీ చూడలేని కుళ్ళు రాజకీయాలతో కపట ప్రేమ వలకబోస్తున్న మాంత్రికుల సాక్షిగా..కూటికి గతిలేని వాడు సైతం కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎదుగుతున్న రౌడీల సాక్షిగా ..ఎవడి కోసం ఈ రాజకీయాలు..ఎవరిని పాలించడానికి ఈ రాజకీయాలు..

ఎటు పోతోంది సమాజం.. ఏమైపోతుంది జీవనం.. ఎలా సాగుతోంది జీవిత గమనం.. ఎవడు ఎవడికి నమ్మకం.. ఎవడు ఎవడికి ఆదర్శం.. ఎవడి ఆలోచన ఎవడిది.. ఎవడి ప్రోత్సాహం ఎప్పటికి.. ఎవడి సామర్ధ్యం ఎంత.. ఏదైనా ఎంత వరకు..??

తెలుగుదేశం : ప్రజా సమస్యలు ఎలాగూ కనపడవు. మొన్నటి వరకు కేంద్రంలో బీజేపీ మేము ఒక్కటే..మాకు వాళ్ళు, వాళ్ళకి మేము ఎప్పుడు తోడుంటాం అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం..ఒక్కసారిగా పోలవరం విషయంలో నిధుల సమీకరణ గురించి, పోలవరం పూర్తిచేసే విషయమై ఇప్పుడు మాట్లాడే మాటలకూ..చేస్తున్న చేతలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరించింది.

వైస్సార్సీపీ : గాల్లో మెడలు కట్టే సిద్ధాంతం. ఎప్పుడు ఏ సమస్యమీద పోరాడాలో..ప్రస్తుతం చేస్తున్న పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నారో..ఎవరికోసం చేస్తున్నారో చేస్తున్న పార్టీ నాయకులకి తెలియకపోయినా కనీసం పార్టీ అధినేతకు అయినా తెలుసోలేదో.

జనసేన : ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్..రాష్ట్రంలో సమస్యలను చూసి ఏమని ప్రశ్నించాలో, ఎవరిని ప్రశ్నించాలో తెలియక..ప్రశ్నించడం మానేసి రాజాకీయాలంటే ఏంటో అవి ఎలా ఉంటాయో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ప్రశ్నిస్తే సమస్యకు పరిష్కారం దొరకదు అని త్వరగానే తెల్సుకున్నారు.

కాంగ్రెస్ : ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది కానీ చరిత్రకి తగిన నాయకుడు లేక అటు చరిత్రకూ, పార్టీ సిద్ధాంతాలకు చెదలు పట్టిపోతుంది. ఇప్పుడిప్పుడే కొత్త నాయకత్వంలోకి అడుగుపెట్టిన సంబరాల్లో మునిగితేలుతున్నారు.

టీఆర్ఎస్ : అధికారం చేపట్టిన కొత్తలో నిజానిజాలు తెలిసినా ఆ నిజాలు ఒప్పుకునే దైర్యంలేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు..ఇప్పుడు అదే నోటితో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అధికారం కట్టబెట్టి మంచిపని చేశాం అని ప్రజలు అనుకునేలోపే దరిద్రాన్ని కోరి..కొనితెచ్చుకున్నాం రా..! అని బాధపడుతున్నారు. ఎవరు మట్టుకు ఏమి చేస్తారు..ఎవడు తవ్వుకున్న గోతిలోవాడే పడ్డట్టు అయింది జనం పరిస్థితి.

ఇక మిగతా పార్టీలు, నాయకులు : అధికారం ఎలాగూ రాదు..కాబట్టి ఎన్నికల నాటికి ఎవరికి మద్దతివ్వాలా అని ఎప్పుడూ కాచుకుని కూర్చుంటారు తప్ప వీళ్ళ వలన మద్దతు తీసుకునే పార్టీకి గానీ, జనానికి గానీ ఒరిగేదేమీ లేదు.

వీటన్నిటికంటే ముఖ్యంగా పైన తెలిపిన అన్ని పార్టీలకు కొంతమంది ఏజెంట్లు ఉంటారు..వాళ్ళ వలన అటు పార్టీలకి, పార్టీ అధినేతలకు తలనొప్పే తప్ప వీళ్ళకి అసలు పార్టీ విధానాలు ఏంటి, ప్రజలకు ఎలా చేరువవ్వాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అనే ఇంగితజ్ఞానం కూడా ఉండదు. పూర్తిగా బ్రష్టుపట్టించిన కుళ్ళు రాజకీయాల వలన లాభ పడుతున్నది ఎవరు, నష్టపోతున్నది ఎవరు. జరిగే లాభం ఎంత, నష్టం ఎంత.

ఊహకందని ప్రశ్నలు, ఆలోచనలు మదిని తొలుస్తున్నా..మిన్నకుండిన విశ్లేషక మహాజనులారా, ప్రజాస్వామ్య యోధులారా మేలుకోండి.

Comments

comments