పవన్ ‘జనసేన’కి ఓ దండం..ఆ వేదిక సాక్షిగా త్రివిక్రమ్ స్పష్టం!

‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన స్పీచ్ అమోఘం. ఈ చిత్రం కోసం తెరవెనుక కష్టపడ్డ ప్రతి టెక్నీషియన్‌కి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతూ.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నానన్నాడు. గొప్ప టెక్నీషియన్స్‌తో పనిచేసినందుకు తనకెంతో సంతోషంగా ఉందని చెప్పాడు. అలాగే.. నటీనటుల ప్రతిభకీ హ్యాట్సాఫ్ చెప్తూ వాళ్ల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నానని వెల్లడించాడు. ఓవరాల్‌గా.. అతని స్పీచ్‌లో ఈసారి యూనిట్‌పై కురిపించిన ప్రశంసలే ఎక్కువ వినిపించాయి.

అంతా బాగానే ఉంది కానీ.. చివర్లో ఒకే పదాన్ని ఆయన రెండుసార్లు చెప్పడం చర్చనీయాంశమైంది. తన స్పీచ్‌లో భాగంగా చివర్లో ‘‘పవన్‌తో మళ్ళీ కలిసి పనిచేసే రోజులు మరిన్ని రావాలని.. సినిమాల పరంగా.. సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ప్రసంగం ముగించాడు. ఇక్కడ త్రివిక్రమ్ ‘సినిమాల పరంగా’ అనే పదాన్ని రెండుసార్లు వక్కానించి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అనే విషయంపై ఆరాతీయగా.. బహుశా రాజకీయపరంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఎంత నిజముందో తెలీదుకానీ.. ఒక బలమైన కారణమైతే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రసంగాలకి త్రివిక్రమే వెనకుండి స్ర్కిప్టులు రెడీ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. రీసెంట్‌గా పవన్ చేపట్టిన ‘చలోరే చలోరే చల్’ టూర్ వరకు ఆ వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వడం కోసమే త్రివిక్రమ్ ఇలా ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారని, అసలు ‘జనసేన’తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పలేక ఈ విధంగా పరోక్షంగా మాట్లాడి ఉంటాడని అంటున్నారు. ఏదైతేనేం.. పవన్ రాజకీయ వ్యవహారాలతో త్రివిక్రమ్‌తో లింక్ లేదని ఇక్కడితో స్పష్టమైంది.

Comments

comments